పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0177-6 శంకరాభరణం సంపుటం: 07-458

పల్లవి:
ఇదివో తెలుసుకొమ్మా యీరెంటికి నీవే గురి
పదివేలు విన్నపాలు భావించుకోనీవే

చ.1:
సరవితో నడచితఏ జగడముఁ జవులే
విరసాన నడచితే వెగటౌఁ బొందు
నిరతి నావద్దనుంటే నీవేమన్నా నాకునింపౌ
పరులవొద్దనుంటే నీపలుకే వేసటలు

చ.2:
తగవులు దప్పకుంటే తమవారే యిందరును
యెగసక్యమైతే తనయిల్లే యెరవు
నగుతా నీవూరకుంటే నేనుపులీడేరును
మొగము ముణుచుకొంటే మోవులౌఁ బ్రియములు

చ.3:
కాఁగలించుకొంటేను కపటమంతయుఁ బాసు
ఆఁగుక వూరకుండితే అదియే కాఁక
వీఁగక శ్రీ వెంకటేశ వెస నన్నుఁగూడితివి
మాఁగిన నీనా మనసు మాఁటువే యిన్నియును