పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0108-3 రామక్రియ సంపుటం: 07-045

పల్లవి:
పోపో నీకిదియేమి పొద్దువోదా
తీపులు చూపి మమ్ముఁ దియ్యకురా యింకను

చ.1:
ఒల్లనివాఁడవు మమ్ము నూరకేల పిలిచేవు
మల్లాడి మాపై మనసు మఱవరాదా
బళ్లీదురాలాకె గొన్న బాస దప్పినాఁ దప్పని
పల్లదాననిఁక నీవు పట్టకురా నన్నును

చ.2:
ఇంటికి రానివాఁడవు యేడనైనా నవ్వనేల
వెంటనే మాతో తగులు విడువరాదా
గొంటరై యిందుకు నాపె కోపగించినాఁ గోపించీ
అంటి ముట్టి సరసములాడకురా యిఁకను

చ.3:
పంతపు వాఁడవు మమ్ము పట్టి కౌఁగిలించనేలా
అంతయు నాపెనేపో అడుగరాదా
చెంతనే శ్రీ వేంకటేశ చేకొని నన్నుఁ గూడితి
వింతకంటె రతినలయించకురా నీవు