పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/459

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు; 0177-5 కాంబోది సంపుటం: 07-457

పల్లవి:
నిన్నుఁ గొసరేటియట్టి నేనే యెడ్డనింతేకాక
యెన్నిమాటలాడినా నీకేడ మొకదాకిరి

చ.1:
సిగ్గులనే తెరగట్టి చెలిమోవి విందువెట్టె
కగ్గనిచనవులుడుగరలిచ్చెను
అగ్గలమై ఆపెకడ ఆడకెట్టు మానేవు
నిగ్గుల నిచ్చకునికి నీకేడ నిజము

చ.2:
కన్నుల నివాళిచ్చె కాఁగిట విడిది వెట్టె
కన్నె దన కుచముల కప్పము వట్టె
చెన్నుమీరనాపెపంపు సేయకెట్టు మానవచ్చు
మన్ననఁ బక్షపాతికి మరియేడ తగవు

చ.3:
ఇచ్చకానఁ బోఁకవెట్టి యింపులనె పెండ్లాడె
మెచ్చేను శ్రీ వెంకటేశ మేలములను
ఇచ్చట నన్నుఁ గూడితివిరుమొనసూదివైతి
విచ్చన విడికాఁడవు వెరుపేల యిఁకను