పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0177-4 సాళంగనాట సంపుటం: 07-456

పల్లవి:
పురుష విరహ మింత పొగులాయ నీవల్ల
సరిఁజూతువు రావమ్మ చక్కని నీవిభుని

చ.1:
తలపోతలనె నీపైఁ దమకించి తమకించీ
పిలుపులనే నిన్నుఁ బేరుకొనీ
చెలులు యెదుటనుంటే చేరి నీసుద్దులడిగీ
కలతువు రావమ్మ గక్కన నీప్రియుని

చ.2:
బయలుగాఁగిళ్ళనే పైపైనె పొద్దువుచ్చీ
నియతిఁ జక్కఁదనాల నిన్నువర్ణించీ
రయముననేడనైనా వ్రాఁతల నీరూపువ్రాసీ
క్రియఁ గూడరావమ్మ కేలుచాఁచి మగని

చ.3:
ఇక్కువ నీ పానుపుపై నెదురులు చూచి చూచి
గక్కన నిన్నుఁగూడె నీ కడకు వచ్చి
యెక్కువ మన్నించి నిన్ను నింటిలోనఁ బెట్టుకొనె
చెక్కునొక్క రావమ్మ శ్రీ వెంకటపతిని