పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0177-2 ఆహిరి సంపుటం; 07-454

పల్లవి:
తఱి నిట్టిపనులెల్లా తగ నీవెరఁగవలె
యెఱుకలు సేసునా యిల్లాలు

చ.1:
చెలి నీమొగము చూచి సెలవిఁ బారఁగ నవ్వె
మలసి మాఁటాడునా మగనాలు
తలుపు మాఁటున నిల్చి తలచూపి నిలుచుండె
చలివాసి తిరుగునా జవరాలు

చ.2:
నీపై భారము వేసి నిట్టూర్పు నిగుడించె
మోపుగట్టునా వలపు ముద్దరాలు
తీపులు మోవిఁగార తేఁకువతోఁ జెమరించె
చాపలానఁ బైపడునా చదురాలు

చ.3:
కొప్పుదువ్వి పయ్యదకొంగు నీపైసోఁకించె
కప్పి సిగ్గు విడుచునా ఘనురాలు
యిప్పడె శ్రీ వెంకటేశ యెనసె నిన్ను గుట్టున
విప్పుచు రట్టుసేసునా విత్తరాలు