పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/454

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0176-6 పాడి సంపుటం; 07-452

పల్లవి:
చేయవయ్య యింకా నీకుఁ జెల్లినటులనెల్లాను
పాయరానిచుట్టుమవై పనిగొంటెవయ్యా

చ.1:
నీనయగారితనమే నిచ్చ నన్ను వలపించె
నానాంటి ప్రియములు నమ్మింపించె
వీనుల వినుకులే వేడుకలు వుట్టించె
కానీవయ్య యింకా నీవే కలవుగా నాకును

చ.2:
మంచి జాణతనములే మరులు గొలిపె మతి
వంచిన మొక్కులు నీకు వసముసేసె
పెంచిన నవ్వులు నీతో పెనఁగలాటకుఁదెచ్చె
యెందకువయ్య నీవే యిచ్చేవింకాఁ జనవు

చ.3:
కాఁగిట నీ కూటములు కళలెల్లమొలపించె
చేఁగదీరిన మోవులు చిమ్మిరేఁచెను
వీఁగక శ్రీ వెంకటేశ వింతలుగాఁ గూడితివి
రేఁగించేవయ్య నీవె రేసులేని మెచ్చులు