పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0176-3 గౌళ సంపుటం: 07-449

పల్లవి:
కొమ్మలాల యిదె మంచి కొలువు వేళ
చిమ్ముచు విన్నపాలెల్లఁ జేయరే యిపుడు

చ.1:
భామఁ దొడపై నిడుక ప్రహ్లద వరదుఁడు
ఆముకొని సరసములాడుచున్నాఁడు
దోమటి వలపులను తొప్పఁదోఁగి చెమటల
ఆమని వేడుకనోలలాడుచున్నాఁడు

చ.2:
చెలి విడమియ్యఁగాను శ్రీ నారసింహుఁడు
నలువంకఁ బకపక నవ్వుచున్నాఁడు
పులకల జొంపముల పువ్వుదండల తోడ
చెలరేఁగి మచ్చికలు సేయుచున్నాఁడు

చ.3:
పాంది లకిమమ్మతోడ బొమ్మిరెడ్డిచెర్లహరి
యిందరి శ్రీ వెంకటేశుఁ డేలుచున్నాఁడు
సందడి రతులఁ జొక్కి జవ్వనమదము మించి
మందెమేళాము సేసుక మన్నింపుచున్నాఁడు