పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0176-1 భైరవి సంపుటం: 07-447

పల్లవి:
మఱియేఁటి విన్నపము మాపుదాఁకాను
కఱదలఁ బెట్టుకింకఁ గావఁగదవయ్యా

చ.1:
చెలి నిన్నుఁబాసివుండి చెమటముత్యాలు చల్లీ
వెలయఁ బారులు గుచ్చి వేసుకోవయ్యా
వెలవెలఁ బారుచు వెసఁ గప్పురాలంపే
వొలిసితే నీవు పెద్దవొడిగట్టుకోవయ్యా

చ.2:
పొందులు నీవి దలఁచి పులకల విరులిచ్చీ
సందెఁడు దండలుగట్టి చాతుకోవయ్యా
సందడి నిట్టూర్చుల విసరుకో సురటిగట్టి
చెంది అందుకును నీవు సేదదేరవయ్యా

చ.3:
కూడఁగ నిన్నుఁ దలఁచి కోరికలఁ జిగిరించీ
వోడక బంతిగట్టుక వుంచుకోవయ్యా
యీడనె శ్రీ వేంకటేశ యింతినిట్టె యేలితివి
వాడకుండా బుజ్జగించి వరమియ్యవయ్యా