పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0175-6 పాడి సంపుటం; 07-446

పల్లవి:
భావము దెలియరే పడఁతులాల
యీవలనావలాను యెన్నఁగొత్తలాయను

చ.1:
తొలుతనే కలువలు తుమ్మిదలనంపితేను
మొలచి తామెర వురుములనంపెను
అల చంద్రుఁడు కానరానట్టె కప్రమంపితేను
తొలఁకి చిగురాకులు దుర్గాలు చేకొనెను

చ.2:
గక్కన మొగలిరేకు కస్తూరీ రేఁచితేను
మక్కువ మొల్లమెగ్గలు మణులానించె
యెక్కువ మరుని పుట్టినింటఁ దేరులు గూడితే
చక్కని కరితుండాలు చక్రముతో నమరె

చ.3:
ముగ్గని మెరుఁగుఁదీగె ముత్తేల పంట పండితే
వెగ్గళించి తేనెపండు వెన్నెలగాసె
అగ్గమై పువ్వులకొమ్మ ఆకులఁగాయలునిచ్చె
సిగ్గుల రాజ్యమేలె శ్రీ వెంకటేశుఁడు