పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0175-4 కాంబోది సంపుటం: 07-444

పల్లవి:
వేసంగి కాలమున వేడ్క సలుపు
శ్రీ సతియు భూసతియుఁ జేరి కలయఁగను

చ.1:
మెఱయు శశికాంతంపు మేడలోపలను
ఆఱిమురి కప్రంపుటరుగుమీఁద
తఱచు వాసనల గందపుఁగోళ్ళ మంచమున
పఱచిఁగుంకమపవ్వు పరపు మీఁద

చ.2:
చలువైన కురువేరు చప్పరములోఁబన్ని
తలకొన్న వట్టివేళ్ళ దడియుఁ గట్టి
మెలుపుఁ జెంగలువలయ మేలుకట్లమరించి
మలసిశేవంతి చామరలు వీవఁగను

చ.3:
పన్నీటి తిత్తులే పై మంచు గురియఁగా
వన్నె తామర నూలి వలువగట్టి
యెన్నఁగల శ్రీ వేంకటేశ్వరుఁడు రతి సలిపె
వెన్నెల రసము చాల వెదచల్లఁగాను