పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0175-1 మధ్యమావతి సంపుటం: 07-441

పల్లవి:
ఇద్దర నిద్దరే మోహమేమి చెప్పేది
అద్దుకొని యిదివో పెండ్లాడినది మొదలు

చ.1:
ఒండొరులఁ జూచి యాసనొగి రెప్పలు వేయరు
యెండలేక చెమరించిరిద్దరు నట్టే
దిండుకొని పానుపుపై తెల్లవారుటెరుఁగరు
నిండుకున్నారు రతుల నేరుపులఁ దాము

చ.2:
పచ్చిమోవితేనెలాని పలుమారుఁ దనియరు
లచ్చనై వొకమాఁటే పులకలురేఁగె
హెచ్చుగా నాకు మడిచి యిచ్చే చెలులఁ జూడరు
పెచ్చువెరిగేరు తమ ప్రియములఁ దాము

చ.3:
తమ మేనులపై గోరితాఁకులౌత చూచుకోరు
జమళి నలపులకు జడియరు
అమర శ్రీ వెంకటేశుఁడలమేలుమంగాఁ గూడి
తమకించేరు లోలోతలఁపులఁ దాము