పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0174-6 శ్రీరాగం సంపుటం; 07-440

పల్లవి:
ఎంతవాఁడవయ్య నీవు యేమని పాగడుదుము
చెంతలఁ గూర్చున్నదాని సిగ్గులు దేర్చితివి

చ.1:
మాఁటలఁ బందిలివెట్టి మగువపాదము మెట్టి
గీఁటుచు కొనగోరను గిలుకొట్టి
మేఁటిరమణుఁడాకె మెరుఁగుఁజన్నులు ముట్టి
పాటించి ముద్దరాలిని ప్రౌఢఁ జేసితివి

చ.2:
పెనువేల మెచ్చు మెచ్చి ప్రియముతోఁ జనవిచ్చి
ననుపు సరసముల నమ్మికలిచ్చి
పనివడి నీవాకె పయ్యదకొంగు వచ్చి
కనుకలిఁ గన్నెఁ దెచ్చి కలికిఁ జేసితివి

చ.3:
కందువలఁ బేరువారి కాఁగిటికూటము మీరి
మందపు నవ్వులనే మందులు నూరి
అందపు శ్రీ వెంకటేశ ఆపెనిట్టె కోరి కోరి
విందులనే బాలఁదెచ్చి వెకలిఁ జేసితివి