పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0174-4 హిందోళవసంతం సంపుటం: 07-438

పల్లవి:
తానేల సిగ్గువడీనే దండకు రమ్మనఁగదే
మేనిపై మచ్చములుంటే మెచ్చి పాగడుదునే

చ.1:
యేమిసేసి వచ్చినాను యెదురాడఁ జాలనే
నాములుగా సెలవుల నవ్వుదుఁగాని
కోమలులఁ దెచ్చుకొంటే కోపగించఁ జాలనే
చేముంచి యిచ్చకములే సేతుఁగాని

చ.2:
తప్పులెన్ని మోచినాను తారుకాణించఁ జాలనే
చిప్పిలఁ జెక్కులు నొక్కి చెల్లింతుఁగాని
దుప్పటి పసపైవుంటే దొమ్మిగా జంకించనే
కొప్పుపై సేసలు చల్లి కూర్చుకొందుఁగాని

చ.3:
వెక్కసమై కళలుంటే వెంగెములాడనే
గక్కున విడెమిచ్చి కలతుఁగాను
యిక్కడ శ్రీవెంకటేశుఁ డిన్నిటా నన్ను నేలె
తక్కులింకఁ జాపనే తమకింతుఁ గాని