పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0108-1 కేదారగౌళ సంపుటం: 07-043

పల్లవి:
మాఱుజుమోమిదేఁటికి మందకుఁదనమేఁటికి
జాఱువడ నేనవ్వితే సంతసించవలదా

చ.1:
వడి నీకెమ్మోవిమీఁది వన్నెదీసినది చూచి
తొడరి వీడెమిచ్చితే దోసమాయిది
కడుచెమటల నీపై గందవొడి చల్లి తేను
జడియక నీవిందుకు సంతసించవలదా

చ.2:
కులికి నీ కన్నులపై కుంకుమవన్నెలు చూచి
బలిమిఁ బన్నీరిచ్చితే పాపమా యిది
కలసిన వేఁడి వేఁడి కాఁకలమేనటు చూచి
చలిగా నే విసరితే సంతసించవలదా

చ.3:
పిప్పియైన నీమేని పెక్కులాగులటు చూచి
ముప్పిరిఁ గళలంటితే మోసమా యిది
అప్పటి శ్రీ వేంకటేశ అలమితివిటు నన్ను
చప్పుడుగాకియ్యకొంటే సంతసించవలదా