పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0173-2 కన్నడగౌళ సంపుటం: 07-430

పల్లవి:
ఏమి దలఁచుకొంటివి యేమిపని సేసితివి
గామిడి నీచేఁతలకు కాంతాళాలు రేఁగవా

చ.1:
మంతనమాడి నమ్మించి మరఁగున నన్నుఁబెట్టి
ఇంతలో నాకె వద్దికి నెట్టువోతివి
వింతవారు నవ్వేరని వెరపుమానితేఁ బోనీ
దొంతర నీ బాసలకు దోసమైనా ముట్టునా

చ.2:
కత చెప్పి నిద్ర పుచ్చి కడు నన్నెరఁగకుండా
రతినెట్టు గూడితివారామ నీడనే
మతిలో వెత లేకుంటే మాననీ దీనిపట్టుకు
కితకుఁడవనే అపకీరితైనాఁ బుట్టదా

చ.3:
యీకడ ననుఁగూడి యెంగిలితోనే పోయి
వాకిట నాపెఁగూడి వచ్చితివిట్టే
చేకొని శ్రీవెంకటేశ సిగ్గులేకుంటే మానని
దాకొని యిరువంకల దగయైనాఁ దొట్టుదా