పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0107-6 శంకరాభరణం సంపుటం: 07-042

పల్లవి:
ఎవ్వరికిఁ గలదమ్మ యింతభాగ్యము
ఇవ్వల నీతోసరి యంచరాదే వొరుల

చ.1:
వీడిన తురుము తోడ విరులు పై పైరాల
వాడిన కన్నుల తోడ వచ్చేవేమే
యేడనుంటి విందాఁకా యెవ్వఁడు నిన్ను భోగించె
చేడె నీ సాబగులిదే చెప్పరాదె నేఁడు

చ.2:
వడియుఁ జెమటల తోడ వత్తివంటి మోవి తోడ
నడపు మురిపెముతో నవ్వేవేమే
యెడచొచ్చి నీ జవ్వన మెవ్వఁడు కొల్లలుగొనె
పడఁతి నీ చెలువము పట్టురాదె యిపుడు

చ.3:
నిద్దుర కన్నుల తోడ నిండుఁ బులకల తోడ
ముద్దుగారే మోము తోడ మురిసేవేమే
వొద్దనె శ్రీ వేంకటేశుఁడొగిఁ గూడుతె (టె?) ఱఁగమే
ముద్దరాల నేఁడు నీమోహమెంచరాదే