పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0172-4 వరాళి సంపుటం: 07-426

పల్లవి:
నీతోడి సాములకు నెలఁత వోపఁగలదా
రాతిరిఁ బగలు నింత రాఁపుసేతురా

చ.1:
కామతంత్రముల నిట్టి కడు నలయించఁగాను
మోము చూచి యింతి నీకు మొక్కు మొక్కీని
గోమునఁ బెంచినయట్టి గొజ్జఁగపూవువంటిది
గామిడితనాల నింత గాసిసేతురా

చ.2:
చలపట్టి కుచములు సారె నీవు పిసుకఁగా
వెలది గడ్డమువట్టి వేఁడుకొనీని
నెలకొన్న అరచేతి నిమ్మపండువంటిది
వలపుల కాతరాన వాడింతురా

చ.3:
మునుకొని కూడుతానె మోవిగంటి సేయఁగాను
అనువుగా నీకుఁ బ్రియము చెప్పీని
ఘనుఁడ శ్రీ వెంకటేశ కప్పురమువంటిదీకె
పెనఁగులాటలనే బెండుసేతురా