పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0172-1 శంకరాభరణం సంపుటం: 07-423

పల్లవి:
ఆవధరించఁగదయ్య అన్నిరసములు నీవు
తివురుచునబ్బెనిదె తేనెమోవిరసము

చ.1:
చెలియచక్కఁదనాన శృంగారరసము
వెలయ బొమజంకెనల వీరరసము
కలయు రతికాంక్షలను కరుణారసము
అలరు మైపులకలను అద్భుతరసంబు

చ.2:
తరుణిసరసములను తగుహస్యరసము
పరుషంపువిరహన భయరసంబు
బెరయు నిబ్బరములను బీభత్సరసము
గరిమ మరుయుద్దాన ఘనరౌద్రరసము

చ.3:
వనిత ఆనందముల వడిశాంతరసము
ననుపుమంతనములను నవరసములు
యెనలేని శ్రీ వేంకటేశ నీతోఁ గూడి
దిన దిన వినోదాల తిరమాయ రసము