పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0171-5 నాదరామక్రియ సంపుటం: 07-421

పల్లవి:
ఎదురుబడి కాఁగిళ్ళు యేరులాయ మీవలపు
అదనుఁ బదనుఁగూడి అడుసాయ వలపు

చ.1:
చిక్కని చెమటలను చిప్పీలీని వలపు
చొక్కపుకరఁగులను జొబ్బిలీని వలపు
చక్కని సరసముల జాలువాలీ వలపు
తెక్కుల మచ్చికలచే దిగి వారీ వలపు

చ.2:
జవ్వనముకళల రసములుబ్బీ వలపు
నివ్వటిల్లు కోరికల నీరుకమ్మీ వలపు
రవ్వల తమకముల వువ్విళ్ళూరీ వలపు
చివ్వనఁ దరితీపుల జిడ్డుకట్టీ వలపు

చ.3:
పంతపు రతులనే పాలుగారి వలపు
బంతి మోవులనె కడుఁ బచ్చిదేరీ వలపు
ఇంతలో శ్రీ వెంకటేశ యెనసి మీరుండఁగాను
దొంతరచుట్టిరికానఁ దొప్పఁదోఁగీ వలపు