పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0171-4 బౌళిరామక్రియ సంపుటం: 07-420

పల్లవి:
ఎటువంటి పందెగాఁడె యితఁడు
అటమటలనే ఆటలన్నీ గెలిచీని

చ.1:
ఆసతో నేఁబగడసాలాడఁగానె పిడికిటి
పాసికలు దీసి తానప్పటి వేసెనే
యీసుతోడ తనపాళి యింటిసారె దాఁకితేను
రాసి యట్టుట్టుండెనంటా బాసచేసీనే

చ.2:
అండనూఁటుకొన్న కాయలట్టె నేఁ బరాకైతే
పండెనంటాఁ బడదొబ్బి పట్టునియ్యఁడే
చండితోడ నాపయ్యెద జార నే వేసిన బారా
వొండొక నెత్తమనుచు వోరచూపీనే

చ.3:
జోడుగూడుకొని వచ్చి సారిది నేఁదాఁకితేను
జోడు తానంటాఁ గూడి చొక్కించెనే
యీడులేని శ్రీ వెంకటేశుఁడిచ్సకానకోడి
వీడెము పందేనకిచ్చి వేడుకచేసీనే