పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0170-3 శ్రీరాగం సంపుటం; 07-413

పల్లవి:
చెలులు గనుఁగొనరె యీసింగారము
నిలువెల్ల రతికళలు నిండుకొనుమాడ్కి

చ.1:
అతివవురమున కంఠహరములు కడుఁ బెక్కు
తతిఁ గట్టుకొన్నచందంబమరెను
కతలుగా ముఖచంద్రుఁగని చన్నుజక్కవలు
క్షితిఁ బాయకుండ లంకెలఁ బెనఁచినట్లు

చ.2:
సుదతి నెన్నుదుటఁ గస్తూరినామము వెలయ
చెదరకుండఁగ దీర్చిన భావము
పొదినూర్చుగాలిచప్పుడుకుఁ గనుచకొరాలు
కదలకుండఁగఁ గట్టుకంభమో యనఁగా

చ.3:
నెలఁత శిరసున విరులు నించుకొనె నీ సాబగు
కలిగి శ్రీ వేంకటేశుఁ గదిసి వుండి
కలికి నాసిక చనుపకము తావికి కురుల
అలులు వోకుండ వలలమరించుగతిని