పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0170-1 నాదరామక్రియ సంపుటం; 07-411

పల్లవి:
చిత్తగించవయ్య యీచెలిని నేఁడు
పొత్తుల వలపులిట్టి పోదిసేసినట్లు

చ.1:
మగువ నీకు మొక్కె మాయింటికి రమ్మని
జిగిఁ దన శిరసుపై జేతులు మోడ్చి
వొగి చంపకనాసికమున్నదని యలులకు
వెగటుగాఁ దామరలు వేగు చెప్పినట్లు

చ.2:
వెలఁది నిన్నుఁ బిలిచె విడెము చేకొనుమని
సెలవుల నవ్వు గండ స్తలులు మోవ
అల తాటంకరవులున్నవని కనుఁగల్వలకు
వెలయ మోముఁజంద్రుఁడు వేగు చెప్పంపినట్లు

చ.3:
కన్నె శ్రీ వెంకటేశుఁడ కాఁగిలించి యేలుమని
చన్నులు బిగ్గెనదిమి సందులంటను
వున్నవి యానమయూరాలొద్దనె పామునకు
విన్నపముగాఁ గొండలు వేగుచెప్పినట్లు