పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0107-4 సాళంగనాట సంపుటం: 07-040

పల్లవి:
నవ్వితినే నీమాటకు నాలో నేను
నవ్వులలోనున్నదిరా నాఁటుకొన్న వలపు

చ.1:
కప్పురము వంటి మాట కారము వంటి చూపులు
చొప్పులు రెండువంకలాఁ జూపేవిదేమే
దెప్పరపు మదముతోఁ దెలుసుకోవేర నీవు
కప్పురపు విడెములోఁ గారమే కాదా

చ.2:
విందువంటి వినయాలు వేఁడివంటి జంకెనలు
అందుక రెండు నడుపేవౌనే నీవు
అందరినీ వారి వీరినడుగవేమో కాని
విందువెట్టినందులోనే వేఁడి చవిగాదా

చ.3:
మెత్తని పరవశాలు మిక్కిలి గట్టి చన్నుల
నొత్తి కూడిన కూటాల నొద్దికైతివే
యిత్తల శ్రీ వేంకటేశ యిప్పుడెఱిఁగితివేమో
మెత్తనినేలనుండవా మేటియైన కొండలు