పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0169-2 దేసాళం సంపుటం; 07-406

పల్లవి:
అంగన చెలువు చూడవయ్యా నివు
సంగడి సింగారాలు సతమై నిలిచెను

చ.1:
వెంటనె చంద్రుఁడు గడు వెన్నెల గాయఁగాను
వొంటిఁ జీఁకటి వెనకకొదిగినట్లు
నంటున నేఁడీచెలియ నవ్వుమోముతోనుండఁగ
అంటి వీఁపునఁ దురుము అందమై నిలిచెను

చ.2:
చెలరేఁగి సింహము చేరి యెక్కితే భారాన
వెలికిఁ గరికుంభాలు వీఁగినయట్లు
మెలుఁత సన్నపు నడిమితోఁ జెలఁగఁగాను
బలిమిఁ బిరుఁదు కిందుపడి తా నిలిచెను

చ.3:
కోవిల వేడుకఁ జవిగొనఁగా లేఁతచిగురు
శ్రీ వెంకటేశ్వర చిల్లులైనట్లు
నీవింతిఁ గూడఁగా నాపె నేరుపుల మాటలతో
వావాత మోవి కెంపులు వరుసలై నిలిచె