పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0168-5 బలహంస సంపుటం: 07-403

పల్లవి:
కడుఁ జుట్టుమవు నీవు కావంటినా
యెడయక నన్నునిట్ట యేలుమంటిఁ గాక

చ.1:
చెక్కునొక్కి నీవు నాచేయిమీఁదఁ జేయి వేసి
తక్కక నవ్వులు నవ్వఁగాఁ దగదంటినా
వొక్కతెపైఁ బెట్టి మాట వొక్కొక్కటి తడవఁగా
వక్కణించనంతేసి వద్దంటిఁ గాక

చ.2:
ఏపున నావద్లనుండి యింత కలసి మెలసి
కాఁపురముసేయఁగాను కాదంటినా
చూపి మోపి యాడోవారి సొమ్ములు మేనఁబెట్టుక
రాఁఫులుసేయఁగా నందుకోపనంటిఁ గాక

చ.3:
చన్నులురమున రాయ సారెఁ గాఁగలించుకొని
యెన్నిచేఁతలు సేసినానేఁటికంటినా
అన్నిట శ్రీ వేంకటేశ అలమేల్మంగనే నేను
మన్నించి కూడితివిది మాననంటిఁ గాక