పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0168-4 సాళంగనాట సంపుటం: 07-402

పల్లవి:
ఇందులోనె వున్నదిదె యింతి తమకములేల
గొందినే కోరికలెల్లా కొమ్ములేకిగిర్చెను

చ.1:
చెలి నీకడకు రాగా చెమటలఁ దొప్పఁదోఁగె
వలపులు వానలేనివరదాయను
ఎలమి నీరాకల కెదురులు చూడఁగాను
వెలయఁగ దీవె లేకే వెలుఁగు గాన్పించెను

చ.2:
వెదకుతానే నిన్నువెలఁది కాఁకలఁ బొందె
యెదుటఁ బొద్దువాడవకెండ గాసెను
ఇదె నీపై యాసలనిట్టె మేను పలకరించె
వెదవెట్టుక ససులు వేవేలు మొలచెను

చ.3:
నీరతికిఁ జేయి చాఁచి నిట్టూర్చుల నిండెఁ జెలి
కోరి యాస గాలిలేక తూరుపెత్తెను
సారె శ్రీ వెంకటేశుఁడ చన్నుల నిన్నునొత్తి
బోరునఁదా జాళెలేని బొమ్మరాలువేసెను