పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0107-3 శ్రీరాగం సంపుటం: 07-039

పల్లవి:
ఈపాటి వలపులు యెఱఁగనివా
పోపో ఆతనికేల బుద్ధి చెప్పేరే

చ.1:
మనసు ముట్టినఁ గాని మాటలూనుఁ జవిగావు
తనువు సోఁకినఁ గాని తనివి లేదు
చనవులిచ్చినఁ గాని సరసములు చెల్లవు
పెనఁగి యాతనినేల పెరరేఁచేరే

చ.2:
తప్పక చూచినఁగాని దగ్గరి రాఁగొలుపదు
చెప్పుడు సుద్దులఁ గాని చింత దీరదు
చొప్పుగా నవ్వినఁ గాని చుట్టరికము నిండదు
యిప్పుడే యాతనినేల యేసపెట్టేరే

చ.3:
ఏకతమయ్యినఁ గాని యెరవులు విడువవు
రాకలఁ బోకలఁ గాని రతివుట్టదు
కైకొని శ్రీ వేంకటాద్రి ఘనుఁడిట్టె నన్నుఁ గూడె
యీకడ యాతనినేల యియ్యకొలిపేరే