పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రెకు: 0101-3 నాదరామక్రియ సంపుటం; 07-003

పల్లవి:
దేవరవైతివిన్నిటా దేవులాయనాపె నీకు
ఆవల మిమ్మిద్దరినేమని పాగడేమయ్యా

చ.1:
పున్నమ వెన్నెలజోడు పూవులలోని వాసన
ఉన్నతిమీరి నీ వురమెక్కెను
మన్నన సంపద రాశి మదనుని పుట్టినిల్లు
వన్నెతో నీకు రాణివాసమాయను

చ.2:
పాల జలనిధి తేట బంగారు లోపలి కళ
కీలితముగా నీకెంగేలు వట్టెను
మేలులో సాకారము మించులోకము భాగ్యము
తాలిమితో నీకు మూలధనమాయను

చ.3:
అందరిని గన్నతల్లి ఆదిమూలమైన లక్ష్మి
కందువ నీ ముంజేతి కంకణమాయను
యిందునె శ్రీవేంకటేశ యీపె సర్వ మోహనము
కందు వాయ నిన్నుఁగూడె కలిమెల్లా మెరసె