పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0167-4 వరాళి సంపుటం: 07-396

పల్లవి:
ఆతని చిత్తమెట్టిదో అదెరఁగను
నీతి తోడ నడపతే నెట్టుకొనే నేను

చ.1:
చలపట్టువద్దుగాని చనవిచ్చి మన్నించితే
చెలరేఁగి యెంతైనా సేవచేసేను
అలుగఁగనోపఁగాని ఆసవెట్టి చెనకితే
నలువంకనెంతైనా నవ్వే నేను

చ.2:
కపటము వద్దుగాని కడుఁబొందు సేసితేను
యెపుడైనా తనమాటకియ్యకొనేను
నెపమెంచనోపఁగాని నేరుపున లాలించితే
వుపమలఁ దనచేఁతకొడఁబడే నేను

చ.3:
మచ్చరము వద్దుగాని మంచితనానఁ గూడితే
మచ్చికఁ దన్నునిట్లా మరిగే నేను
తచ్చనలకోపఁ గాని తగిలి శ్రీవేంకటేశుఁ
డిచ్చట నన్నేలీనాఁడు యిరవైతి నేను