పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0167-1 శ్రీరాగం సంపుటం: 07-393

పల్లవి:
అంగనకు నికుఁబొందు అధరామృతపు విందు
అంగవించి సరసములాడ నిదే సందు

చ.1:
మనసులొక్కటులాయ మర్మములొండొంటి రాయ
తనివోని వలపులు తగులుసేయ
ఎనసి మీరున్నవారు యింపులకిదే తీరు
చెనకి మీలో మీకు చెల్లదిఁక దూరు

చ.2:
తలపోఁతలొనఁగూడె దట్టపు సిగ్గులు వీడె
యెలమి మీ కోరికలు యీడుజోడాడె
పులకలు నిండె మేన పాసఁగదు తొల్లిటాన
చెలరేఁగెనిద్దరికిఁ జెమటల సోన

చ.3:
మెగమునఁ గళలెక్కి ముచ్చటలెల్లా దక్కె
సాగసైన రతుల చొక్కులు నిక్కె
నిగిడి శ్రీ వెంకటేశ నెలఁతఁ గూడితివిదె
మొగమోట నీకునీపో ముందరను మొక్కె