పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0165-6 శంకరాభరణం సంపుటం: 07-392

పల్లవి:
వెలఁది భావము నీకు విన్నవించితి
యెలమి నాపె వలపులేమి చెప్పేదిఁకను

చ.1:
నిరతముఁ బ్రేమతోడ నీవు చేసిన చేఁతలు
తరుణికినే పొద్దు తలపోఁతలు
సరవి నీవు దీసిన చన్నులపై గీఁతలు
సిరుల జవ్వనపు లచ్చెనవాఁతలు

చ.2:
చతురుఁడ నీవు మున్ను చల్లిన యట్టి శాసలు
అతివకు పాయని అడియాసలు
యితరులెరఁగఁగానె యిచ్చిన నీ బాసలు
తతి సవతులకు సదా గోసనాసలు

చ.3:
వొలిసి నీవాడిన వొడఁబాటు మాటలు
చెలికి వీణలో వాయించే పాటలు
యెలమి శ్రీ వెంకటేశ యీకె నిట్టె కూడితివి
అల మోవి తేనె వూటలమృతపుఁ దేటలు