పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0166-2 సౌరాష్ట్రం సంపుటం: 07-388

పల్లవి:
పడఁతి చందములు నీభాగ్యమాయను
యెడయకాపెకు నిట్టె యేకచిత్తమాయను

చ.1:
కొలువులోఁ గొప్పువీడి కొమ్మ చక్కఁబెట్టుకోఁగా
వలుద చన్నులు గానవచ్చెనదివో
చెలఁగి రెంటికిఁగాను సిగ్గువడి యెంతలోనే
బలిమి నీ పచ్చడము పైఁగప్పుకొనెను

చ.2:
కాంత మేను చెమరించి కట్టుఁజీర తొప్పఁదోఁగి
వింతగాఁ దొడలకాంతి వెలిఁబడెను
చెంతనేమీననరాక శిరసు వంచుకొని
మంతనాన నీ మలఁగుమాటునఁ గూచుండెను

చ.3:
అలమేల్‌మంగ పులకలంగమున నుబ్బఁగాను
బలిమిఁ గుచ్చల జారి పచ్చిదేరెను
అలరి అందుకు నిందుకౌఁగాదనఁగ రాక
నెలవై శ్రీ వేంకటేశ నిన్నుఁ గాఁగిలించెను