పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0165-4 పాడి. సంపుటం; 07-384

పల్లవి:
ఆపె చేసిన చేఁతకు అమరునా నీమేలు
మోపులు గట్టేవు యింతి మునుకొన్న సుద్దులు

చ.1:
చుట్టుపు వరుసనాకె సుద్దులెల్లా నిన్నడిగి
అట్టె కప్పురము మోవి అంది యిచ్చెను
ముట్టి పయ్యదకొంగు నీముంజేతఁ జుట్టుకొని
బట్టుబయలీఁదించేవు పడఁతి చన్నులను

చ.2:
మంచితనముననె మచ్చికలు నీకుఁ జూపి
అంచగమన బాగాలు అంది యిచ్చెను
ముంచిన వేడుకతో మునివేళ్ళ శిరసెత్తి
అంచలఁ దేలించేవు అంగనచూపులను

చ.3:
ఒడఁబాటుతోఁ గూడి నిన్నొరసినలమేల్‌మంగ
అడియాలమగు సొమ్ములంది యిచ్చెను
తొడఁదొడ మోయ కాలుదొక్కి శ్రీవెంకటేశ
పడియించేవు చెమట వనితదేహమున