పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0165-3 కాంబోది సంపుటం: 07-383

పల్లవి:
ఏమి సేసితిమి నిన్ను యేల తడవేవు మమ్ము
మోము చూచితే నీకు మొక్కరాదా యేమి

చ.1:
మచ్చరాన వెంగెముగా మాటలాడరాదు గాక
యిచ్చకములాడితేను యెగ్గాయేమి
కొచ్చి మూతులుగిరిపి గుంపించవద్దుగాక
మెచ్చి తలవూబితేను మేలుగాదా యేమి

చ.2:
చేరి నీపైఁ దప్పువేసి చేయిచాఁచరాదు గాక
కోరి పాదాలొత్తితేను కోపమా యేమి
బీరముతోనొడివట్టి పెనఁగఁగ వద్దుగాక
కూరిమిఁ గొంగువట్టితే కొరతా యేమి

చ.3:
సరి నీకు మనసు దాఁచఁగరాదు గాక
తెరవేసి కూడితేను దిగ్గుడా యేమి
యిరవై శ్రీ వేంకటేశ యేలితివి నన్నునిటె
విరులవేసి నవ్వితే వెగటా యేమి