పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0165-2 బౌళిరామక్రియ సంపుటం: 07-382

పల్లవి:
ఆతఁడేమనునో యని అనుమానించఁగనేల
చేతికిఁ గానుకియ్యవే చెప్పీఁ దానె సుద్దులు

చ.1:
వలవనేర్చినవాఁడు వట్టిజాలిఁ బెట్టఁడు
పలుకనేర్చీనవాఁడు బాసదప్పఁడు
కలయనేర్చినవాఁడు గర్వములు చూపఁడు
పిలువవే యతని నాప్రేమ తానె యెరుఁగును

చ.2:
మనసెరిఁగినవాఁడు మరి జవదాఁటఁడు
తనవాఁడైనవాఁడు వింతలు సేయఁడు
ననుపు గలుగువాఁడు నవ్వినానెగ్గుపట్టఁడు
వినయాన దోడితేవే విభుఁడన్నీ నెరుఁగు

చ.3:
ఆసలుగలవాఁడు అట్టె జోలీసేయఁడు
వాసిగలవాఁడు తనవారిఁ బాయఁడు
సేసవెట్టెఁ దానె వచ్చి శ్రీ వేంకటేశుఁడు గూడె
రాసీకెక్కె దినమును రప్పించవే ఆతని