పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0164-4 హిజ్జిజి సంపుటం; 07-378

పల్లవి:
మంకు గొల్లవారైతేనే మానము లేదా
బింకమున నాతోనెంత పెనఁగులాడేవు

చ.1:
కాఁపురము సేసేదానిఁ గలువ పువ్వుల వేసి
రాఁపుసేసి మమ్మునేల రచ్చఁబెట్టేవు
పూఁపచన్నులు పయ్యదఁ బొదిగి దాఁచుకుండఁగా
చూపుమని మమ్మునెంత సోదించేవు

చ.2:
సిగ్గుతోడన్నుదానిఁ జేతులు వట్టి తీసి
కగ్గుదేర నెంత నవ్వి కాకుసేసేవు
వొగ్గి తేనెమోవి చేతనూరకే మూసుకుండఁగా
వెగ్గళించి యెంగిలి గావించనేల వచ్చేవు

చ.3:
పానుపుపై నున్నదానిపక్కఁ బండి కౌఁగిలించి
మేను ముట్టి నన్నునెట్టు మేర మీరేవు
పూని శ్రీ వెంకటేశుఁడ పొంచి తెరలోనుండఁగా
ఆనవెట్టి రతినెంత అలయించేవు