పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0164-2 దేసాళం సంపుటం: 07-376

పల్లవి:
అదేల నవ్వేవంటానడిగేవప్పటి నన్ను
సుదతులలో నిన్నుఁ జూచి నవ్వురాదా

చ.1:
ఇంటింటికేఁగి వచ్చి యిందరు నీవారంటా
నంటు చూపి మాటాడఁగా నవ్వురాదా
దంటయైన చెమటలచేఁ దడిసిన పచ్చడము
అంటించి చేతికియ్యఁగానందుకు నవ్వురాదా

చ.2:
వెలఁదుల పొత్తులను విందులారగించి వచ్చి
నలిఁ జవులు చెప్పఁగా నవ్వురాదా
కొలువుకాంతలిచ్చిన గొప్ప నిమ్మపండ్లెల్లా
లలి నీచేనుండఁగా మెల్లనె నవ్వురాదా

చ.3:
పడఁతులకుఁ గప్పూరబాగాలు నీవు వెట్టఁగా
నడుమ నుండిన నాకు నవ్వురాదా
యెడయక శ్రీ వెంకటేశ నన్నునేలితివి
కడమలేని రతులకింకా నవ్వురాదా