పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0163-4 శ్రీరాగం సంపుటం; 07-372

పల్లవి:
వెలఁది సింగారము వింత వింత బాగులాయ
చెలువపు విభుఁడవు చిత్తగించవయ్యా

చ.1:
తేఁటులు పువ్వులుండిన చోటికి వచ్చుఁగాక
తేఁటులలోఁ బువ్వులెట్టు తిరమాయను
గాఁటపు చందురురాక కలువలు గోరుఁగాక
వాఁటమై చంద్రునిలోఁ గల్వలు తావుకొనునా

చ.2:
చివ్వనను సంపెంగ చిగురుపై బూచుఁగాక
పువ్వుకొనఁ జిగురు దాపుగనుండునా
వువ్విళ్ళూరఁ గొండలపై నుండుఁగాక సింహము
కొవ్వు మీరి సింహము కొండలుదామోచునా

చ.3:
అల మరుతేరిపైనంపపోదులుండుఁ గాక
అలరులు పాదులు తేరునఁ గలవా
బలిమి నీలానకు బంగారు గమ్యౌఁగాక
నెలవై శ్రీ వేంకటేశ నీలము గమ్యౌనా