పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0163-3 భైరవి సంపుటం: 07-371

పల్లవి:
నేనే వింతగాని నీ చుట్టాలవేయివి
కానుకగా నేఁదెచ్చితే కడు వెంగమనేవు

చ.1:
కప్పురము నేనిచ్చితే కసరుదురా
దప్పికి నెవ్వతో నీకు దాఁచినది
తెప్పిర సురటి వీచితే జంకింతురా
వొప్పుగా నాపెరూపు వొనర వ్రాసినది

చ.2:
పానుపు వరచితే సిగ్గువడుదురా యిందాఁక
నీనెలఁత యెవ్వతో నిద్రించినది
వూని గందమిచ్చితే వొల్లనందురా
మేననాకె వూనుకొని మిగిలినది

చ.3:
సారెఁ బువ్వుల వేసితే సాదింతురా
కూరిమి నీ సతి పెద్ద కొప్పులోనివి
చేరి నన్నుఁ గూడితివి శ్రీ వేంకటేశ్వర
వారిదాననే నేను వచ్చి పెండ్లాడితిని