పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రెకు: 0106-6 గౌళ సంపుటం: 07-036

పల్లవి:
ఓసరించి యేమిటికి నోపినట్టి దానఁ గాను
ఆసల రక్షించు పుణ్యమదే సుమ్మీ యిఁకను

చ.1:
ఊరకున్న నన్నుఁదెచ్చి వొకటొకటే నేరిపి
యీరీతినె చనవిచ్చి యింత సేసితి
నేరుపు నేరాలెంచవు నీవు గాచేవాఁడవే
గోరపెట్టి విరహానఁ గుమ్మకుమీ నన్నును

చ.2:
చిన్ననాఁడే నన్నుఁ దెచ్చి సేవలు సెయించుకొని
యిన్నిటాఁ బెద్దరికాన యింత సేసితి
వన్నెలు యెప్పుడు సేసేవే వలపు నే నెరుఁగుదు
వున్నమాయలకు నన్ను వొడ్డకుమీ యిఁకను

చ.3:
మాయింటికి విచ్చేసి మంతనాన నమ్మికిచ్చి
యీ యెడనే నన్నుఁ గూడి యింతసేసితి
పాయపు శ్రీ వేంకటేశ బదికించేదెఱఁగనా
చాయల అపకీర్తికి చాల సుమ్మీ యిఁకను