పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0161-3 పాడి సంపుటం; 07-365

పల్లవి:
ఎప్పుడూఁ దగులాయమె యెంతైనాఁ బోదు
తప్పదు నాయకుఁడిందు తానే వచ్చీని

చ.1:
పట్టి పెనఁగితేనేమి పంతములాడితేనేమి
గట్టిగా మేనరికము గలవారికి
వొట్టు వెట్టితేనేమి వొరసి పైకొంటేనేమి
చుట్టురికమియ్యకొన్న సులభపువారికి

చ.2:
తప్పక చూచితేనేమి తలవంచుకొంటేనేమి
అప్పసము వలచిన యట్టివారికి
కొప్పువట్టితేనేమి కొనగోరూఁదితేనేమి
వొప్పుగ సరసమాడే వొద్దికైనవారికి

చ.3:
చేసన్న చేసితేనేమి సిగ్గులువడితేనేమి
యీసులేక మెలఁగేటి్‌ యింటివారికి
వేసరక యీతఁడె శ్రీ వేంకటేశుఁడు నన్నేలె
పాసివుండరాదు నేరుపరులైనవారికి