పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0162-2 ముఖారి సంపుటం: 07-364

పల్లవి:
గద్దించి నేఁడు కొత్తలు గడించెఁ గాక
వోద్దికై మందెమేళాననుండమా తొల్లి

చ.1:
వొంటి నేఁజెనకితే వొరపులు వట్టీని
నంటునఁ దాను నేను నవ్వమా తొల్లి
వెంటవెంట నెరసులు వెదకీనప్పటివచ్చి
అంటి ముట్టి సరసములాడమా తొల్లి

చ.2:
కందువ నాచన్నులు దాఁకఁగా దప్పక చూచీని
అంది కమలాల వేట్లాడమా తొల్లి
ముందు నాయెంగిలిమోవి మోవ మాటాడితిననీ
విందుపొత్తులు గలసి వెలయమా తొల్లి

చ.3:
బీరమునఁ దనతోడఁ బెనఁగితినని యాడీ
కూరిమితోఁ గాఁగలించుకొనమా తొల్లి
యీరీతి శ్రీ వేంకటేశుఁడిన్నిటా నన్నేలీనాఁడు
చేరి చుట్టురికాలెల్లాఁ జేయమా తొల్లి