పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0162-1 సామంతం సంపుటం: 07-363

పల్లవి:
పిలిచీ రాఁగదవే ప్రియుఁడు నిన్ను
బలిమి సేసినంతనే పనులెల్లా దక్కునా

చ.1:
కలసి మెలసి వుంటే కాపురమీడేరుఁ గాక
పెలుచుఁదనాననుంటే ప్రేమ వుట్టునా
నెలఁతకు మగనితో నేస్తమే మంచిదిగాక
అలుకలు నెరపితే నట్టే విసుగరా

చ.2:
మాటలు సారెనాడఁగా మనసులెనయుఁగాక
జూటుఁదనాన నుండితే సొంపు గల్గునా
మేటిజవ్వనపువారు మేలుమీఁదివారుగాక
బూటకము చూపితేను పొందులు వొసఁగునా

చ.3:
సరసములాడఁగానే చవులు గానిపించుఁగాక
యెరపరికములైతే యెబ్బిడి గాదా
సిరుల నిన్నేలె నేఁడు శ్రీవేంకటేశ్వరుఁడు
మరిగి పాయకుండితే మచ్చికలు రేఁగవా