పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0161-6 శంకరాభరణం సంపుటం: 07-362

పల్లవి:
ఆడఁగల మాటగాఁగానాడితిఁగాక
పాడిపంతాలిందులోన పచారించనేఁటికే

చ.1:
మనసునఁ గలితేనే మాటలాడనింపు వుట్ట
చనవులు సతమైతే సంతోసమౌను
పెనఁగఁగఁ జోటిచ్చితే ప్రియములు గడునిండు
ఘనుఁడు తానేమన్నాఁ గాదనేనటవే

చ.2:
ఆసగలిగినచోట అన్నిటాఁ గొసరఁదగు
వేసట లేనిపాందు వెగటుగాదు
వాసితోడిమెలఁకువ వలపు దానె పుట్టించు
సేసవెట్టేఁ దనమాట చెల్లెనని యనవే

చ.3:
పరగ నవ్వు నవ్వితే పనులెల్లాఁ జేకూరు
తరితీపులైతేనే తమిరేఁగును
యిరవై శ్రీవేంకటేశుఁడింతలోనే నన్నునేలె
సరసమెంతాడినాను సమ్మతి నాకనవే