పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0161-3 కన్నడగౌళ సంపుటం: 07-359

పల్లవి:
ఏమయ్యా నీవెరఁగవా యింతిగుణమెల్లాను
కామించి నీదేవులాయఁ గడమలు గలవా

చ.1:
సతులెంతైనా దీమసమే చూపుదురుగాక
తతిఁ దమవాసి వన్నె దప్పఁగలరా
పతి యెట్టు నడపినాఁ బరిణామింతురుగాక
బతిమాలి సవతుల పంగెనకుఁ జొత్తురా

చ.2:
నెట్టున దొరతనమే నెరపఁ జూతురుగాక
గుట్టువిడువ నేర్తురా గుణవతులు
దట్టుపుమానముతోనే తగురై వుందురుగాక
తొట్టి సిగ్గులు విడుతురా యెప్పుడును

చ.3:
వెలలేని పంతముల విఱవీఁగుదురు గాక
అలసి లోఁగుదురా అందరిలోన
యెలమి శ్రీవెంకటేశ యీకెనిట్టె యేలితివి
బలిమి మానుదురా నిబ్బరమైన రతిని