పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0161-1 శ్రీరాగం సంపుటం; 07-357

పల్లవి:
ఏఁటికిఁ బొద్దు గడుపేవిటు మాతోను
చోటిచ్చి యాపెను రతిఁజొక్కించరాదా

చ.1:
చెలిమినీయఁగ నేర్చు చెప్పనేర్చు బుద్దులెల్లా
పిలిపంచి యాపెనొద్దఁ బెట్టుకోరాదా
నిలిచి కొలువుసేసు నీమర్మాలు దానెరుఁగు
చలివాయ మాటలాడి చనవియ్యరాదా

చ.2:
చెనకి నిన్ను నవ్వించు సిగ్గులుదేర్చునాపె
యెనసి వూడిగాలు సేయించుకోరాదా
వినయాలు సేసుఁ గడు వేడుకలు నీకు రేఁచు
వొనరఁ బానుపుపైఁ దోడుండుమనరాదా

చ.3:
మరిగించుకొనునాపె మనసురా మెలఁగును
సిరులఁ జుట్టరికము సేయరాదా
నిరతి శ్రీ వెంకటేశ నేనలమేలుమంగను
సరి నన్నేలితివాపె సమ్మతిసేయరాదా