పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0160-6 మంగళకౌాశిక సంపుటం: 07-356

పల్లవి:
అటుగాన నీచేఁతలమృతములె నీకు
యెటువలెనైనా మీకిద్దరికిఁ దగును

చ.1:
మొక్కలాన నడచినా మురిపెములై తోఁచు
చక్కఁదనములు గల జలజాక్షులు
కక్కసించి మాటాడినా కామమంత్రమై తోఁచు
వెక్కసపు జవ్వనాన విఱవీఁగేవారలు

చ.2:
అలవోకగా నవ్విన ఆయములు గరఁగను
వలపించ నేరిచిన వనితలు
తలకొని జంకించినా తరితీపులై యుండు
నిలిచి జంటవాయని నెరజాణలు

చ.3:
వొడివట్టి పెనఁగినా వొడఁబాటులై మించు
కడువిలాసాలతోడి కామినులు
అడరి శ్రీ వెంకటేశ అలమేలుమంగ యీకె
తడయక కూడెనిదె తగవందురిందరు