పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0160-4 కాంబోది సంపుటం; 07-354

పల్లవి:
మగవాఁడిది యెరిఁగి మగువలనేలవలె
నిగిడి వోరమణుఁడ నీచిత్తమిఁకను

చ.1:
వినయమే చూపును విభుఁడెంత జరసినా
చనవున గర్వించదు జాణైనది
పెనఁగులాడదు యెంత బెట్టిసరసమాడినా
మనసు రామెలఁగును మర్మఁమెరిగినది

చ.2:
మచ్చికలే నెరపును మగఁడెంత పరాకైనా
కొచ్చి నేరాలెంచదు గుణియైనది
రచ్చలోఁ జెప్పుకొనదు రతికెంత పలిచినా
విచ్చనవిడి భోగించు వెరవరియైనది

చ.3:
గక్కనఁ గాఁగిటనించు కాంతుఁడెంత బిగిసినా
వుక్కుమీరి యలుగదు వొద్దికైనది
యిక్కడ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
యిక్కువలు గరఁగించు యితవరియైనది