పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0160-2 నాదరామక్రియ సంపుటం; 07-352

పల్లవి:
ఎవ్వతెకో యీకెయంటా యెంతేసి తుటారించితి
చివ్వన నిందుకుఁగాను చిన్నఁబోకు మిఁకను

చ.1:
ఆపెపై బత్తిగలిగితే నప్పుడే చెప్పవలదా
చేపట్టి నేనిచ్చకము సేకుందును
యీపాటి నీదేవులైతే నింటికిఁ దెచ్చుకో వద్దా
చూపెట్టుకో వొాక్కమనసుననుందును

చ.2:
తగులు నీకుఁ గలితే తారుకాణించవలదా
పగటున నేనూ వొడఁబడియుందును
నగినవాఁడవా పొందు నడపఁగ వలదా
తగినట్టు తగవులు తప్పక నేనుందును

చ.3:
చుట్టురికము గలితే నాకుఁ జూపఁగవలదా
వొట్టుకొని సంతోసాన నూరకుందును
నెట్టన శ్రీ వెంకటేశ నేనలమేల్‌ మంగను
గట్టిగా నన్నేలితివి కానిమ్మని వుందును