పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0160-1 కేదారగౌళ సంపుటం: 07-351

పల్లవి:
ఇప్పుడు మాఅక్క వింటే యేమనువో యిందుకు
దప్పిదేర సారెనేల తడవేవు మమ్మును

చ.1:
పంతముతోఁ గూచుండఁగా పనిగద్దు రమ్మనేవు
యెంతలేదు ఆపని నేనెరిఁగినదే
సంతోసాన నీమొగము చక్కఁజూడుమనేవు
దొంతరలుగా నేనెప్పుడ తొల్లే చూచినది

చ.2:
తొరలి యప్పటి నన్ను నీతోడుత నవ్వుమనేవు
గరిమ నీచేఁతలకుఁ గడు నవ్వుదురు
మరుమాటలు నాతో మక్కువనాడుమనేవు
అరసి నీవాడితివి అవే నామాటలు

చ.3:
కొలఁది మీరఁగ నాకూటమికిఁ బెనఁగేవు
అలమేల్మంగఁ గూడితివదియె నారతి
యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్నునేఁడు
బలిమిఁ దొల్లే యేలుబడిదానఁ గానా